పార్టీ నేతలకు నో ఛాన్స్...కాంగ్రెస్ నేతకు భాజపా పగ్గాలు!

రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. మాజీ కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఏపి భాజపా అధ్యక్షుడుగా నియమితులయ్యారు. విశేషమేమిటంటే, గత కొంతకాలంగా ఈ పదవికోసం ఆశగా ఎదురుచూసిన అయన దానిపై భాజపా అధిష్టానం ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో కొని రోజుల క్రితమే వైకాపాలో చేరడానికి సిద్దపడ్డారు. కానీ అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలవడంతో పార్టీ మారలేకపోయారు. ఆయనకు అదే అదృష్టంగా మారింది. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన మరుసటిరోజే అంటే ఆదివారమే అయనను ఏపి భాజపా అధ్యక్షుడుగా నియమిస్తున్నట్లు భాజపా ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఇక ఆ పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన భాజపా నేతలు సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణలలో వీర్రాజుకు ఏపి ఎన్నికల నిర్వహణ కన్వీనర్ పదవి లభించింది. 

చిరకాలంగా భాజపాలో ఉన్న సీనియర్ నేతలను కాదని, వైకాపాలో చేరిపోవడానికి సిద్దపడిన మాజీ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఏపి భాజపా పగ్గాలు అప్పగించడంతో పార్టీలో అసంతృప్తి ఏర్పడే అవకాశాలున్నాయి.