మెట్రో కబుర్లు

విమానాశ్రయాలను తలదన్నేలా అద్భుతంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, ఉపయుక్తంగా తీర్చిదిద్దేందుకు హెచ్.ఎం.ఆర్.ఎస్., ఎల్&టి సంస్థల అధికారులు ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు. 

మెట్రో కారిడార్ నగరంలో ప్రదాన ప్రాంతాల మీదుగా సాగుతున్నప్పటికీ, ఆ ప్రాంతాలలో గల మార్కెట్లు, సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలకు చేరుకోవడానికి మెట్రో ప్రయాణికులు స్టేషన్ నుంచి క్రిందకు దిగి రోడ్లు దాటి అక్కడకు చేరుకోవలసివస్తోంది. కనుక మెట్రో స్టేషన్ల సమీపంలో ఉండే కొన్ని ప్రధానమైన ప్రాంతాలను కలుపుతూ ‘స్కైవే’లు నిర్మిస్తే ఎలా ఉంటుందని మెట్రో అధికారులు ఆలోచన చేస్తున్నారు. 

ఉదాహరణకు ప్యాట్నీ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ కు, అలాగే సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కలుపుతూ స్కైవేలు నిర్మించినట్లయితే మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికులు నేరుగా అక్కడికి చేరుకోవచ్చును. స్కైవేలతో మెట్రో స్టేషన్లను అనుసంధానం చేయగలిగినట్లయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది కనుక మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా బారీగా పెరుగవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

మెట్రో అధికారులు, జి.హెచ్.ఎం.సి. అధికారులు కలిసి త్వరలోనే ఒక సర్వే చేపట్టనున్నారు. స్కైవే నిర్మాణంలో సాధకబాధకాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఒక మెట్రో స్టేషన్ ను సమీపంలోని ప్రధాన ప్రాంతాన్ని కలుపుతూ స్కైవే నిర్మించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు.