తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వీరవరపులంక గ్రామం సమీపంలో గోదావరి నదిలో శుక్రవారం ఉదయం పాపికొండలు యాత్రకు బయలుదేరిన ఒక టూరిస్ట్ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే అది ఇంకా ఒడ్డు నుంచి ఎక్కువ దూరం వెళ్ళకపోవడంతో డ్రైవరు బోటును వెంటనే ఒడ్డుకు చేర్చడంతో ఆ బోటులో ప్రయాణిస్తున్న 120 మంది ప్రయాణికులు సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. బోటులో నుంచి ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాలకే బోటు మొత్తం అగ్నిజ్వాలలలో మాడిమసయిపోయింది.
బోటు డ్రైవరు అప్రమత్తంతో ఉన్నందున మంటలు అంటుకోగానే క్షణం ఆలస్యం చేయకుండా బోటును ఒడ్డుకు చేర్చడంతో ప్రయాణికులందరూ త్రుటిలో ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ ప్రమాదంలో ఎవరూ పెద్దగా గాయపడలేదు. బోటులో ఉండే జనరేటర్ లో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఒక ప్రయాణికుడు చెపుతున్నారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ప్రయాణికులు అందరినీ దేవీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు పంపించి వేశారు.