.jpg)
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగియడంతో, శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి విమానంలో తిరుపతి చేరుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. మళ్ళీ కొండదిగి తిరుపతి విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు అలిపిరిగేటు వద్ద తెదేపా కార్యకర్తలు నల్లజెండాలతో ఎదురువచ్చి ‘అమిత్ షా డౌన్ డౌన్..అమిత్ షా గొ బ్యాక్.. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలి’ అని నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్ ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి పరిస్థితి ఎదురవవచ్చని ముందే ఊహించిన పోలీసులు అలిపిరి నుంచి విమానాశ్రయం వరకు చాలా బారీ సంఖ్యలో పోలీసులను మొహరించి కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో ఆందోళనకారులు అమిత్ షా వరకు చేరుకోలేకపోయారు. కానీ వారిలో ఒకరు విసిరిన రాయి తగిలి అమిత్ షా కాన్వాయ్ లో ఒక కారు వెనుక అద్దం పగిలిపోయింది.
తెదేపా కార్యకర్తలు అమిత్ షాను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుండగా ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో తెదేపా-భాజపా కార్యకర్తలు దాదాపు కొట్టుకొనేవరకు వెళ్ళారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు.
ఒకప్పుడు అమిత్ షా ఏపికి వస్తే ఆయనకు తెదేపా నేతలు అడుగడుగునా సన్మానాలు, మర్యాదలు చేసేవారు. కానీ భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొన్న తరువాత, తెదేపా ఎమ్మెల్యేకూడా అమిత్ షాను పలకరించేందుకు రాలేదు. పైగా తెదేపా కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించి అయన రాకను నిరసిస్తున్నట్లు తెలియజెప్పారు. తిరుపతిలో అమిత్ షాకు ఎదురైనా ఈ చేదు అనుభవం గురించి ఏపి తెదేపా, భాజపా నేతలు ఇంకా స్పందించవలసి ఉంది.