
అది శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం. హుజురాబాద్ కు ఆ ఊరి మీదుగానే వెళ్ళాలి. ఆ గ్రామంలో ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతోంది. అంతలో అక్కడకు హటాత్తుగా పోలీసులు వచ్చేరు. వారిని చూసి పెళ్ళివారు ఏమి జరిగిందోనని కంగారు పడుతుంటే, వారి వెనుకే ఒక బక్క పలచన వ్యక్తి వచ్చాడు. అతనే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్. అయన హుజూరాబాద్ లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళుతుండగా దారిలో రోడ్డుపక్కనే ఉన్న ఒక ఇంటి ముందున్న పెళ్ళి పందిరిలో పెళ్ళి జరుగుతుండటం చూసి, ముఖ్యమంత్రి కెసిఆర్ తన కాన్వాయ్ ను ఆపించి, కారు దిగి అక్కడకు వెళ్ళి నూతన దంపతులు కావ్య, మనోహర్ లపై అక్షింతలు జల్లి ఆశీర్వదించారు.
సాక్షాత్ ముఖ్యమంత్రి కెసిఆరే తమ పెళ్ళికి వచ్చి దీవించడం చూసి నవ దంపతులతో సహా పెళ్ళివారు చాలా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. పెళ్ళి కుమార్తె కావ్యకు ‘కళ్యాణలక్ష్మి’ పధకం క్రింద ఒక లక్షా నూటపదహారు రూపాయలు బహుమానంగా అందజేయాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చారన్న సంగతి తెలుసుకొని గ్రామ ప్రజలందరూ అక్కడికి పరుగున వచ్చారు. వారినందరినీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆప్యాయంగా పలుకరించి హుజూరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు.
ఒక పేద కుటుంబంలో జరుగుతున్న పెళ్ళికి సాక్షాత్ ముఖ్యమంత్రి అతిధిగా వచ్చి ఆశీర్వదించి, లక్ష రూపాయలు కానుక ప్రకటించడం చూసి తాడికల్ గ్రామస్తులు చాలా సంతోషంతో ఉప్పొంగిపోయారు. మనసున్న మారాజు మా ముఖ్యమంత్రి మా కెసిఆర్ అని మనసారా మెచ్చుకున్నారు.