రైతన్నలూ తస్మాత్ జాగ్రత్త!

నేటి నుంచి రాబోయే నాలుగు రోజుల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో బారీగా వర్షాలు పడవచ్చని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే గురువారం తెలంగాణా రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి జిల్లాలలో వర్షం పడింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన బారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాలలో అతిబారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

నగర ప్రజలకు ఈ వర్షాలు కొంత ఇబ్బందులు సృష్టించిన వేసవి తాపం నుంచి చాలా ఊరట కలిగిస్తాయి. కానీ ఈ అకాల బారీవర్షాలు, వడగళ్ళ వలన పల్లెలలో చేతికి వచ్చిన పంటలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. అలాగే మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన ధాన్యం, మిర్చి మొదలైన పంట ఉత్పత్తులు ఆరుబయటే ఎటువంటి రక్షణాలేకుండా ఉంటాయి కనుక అవి ఈ అకాల వర్షాలకు తడిసిపోయే ప్రమాదం ఉంది. కనుక మార్కెట్ యార్డులలో తూనిక కోసం ఎదురుచూస్తున్న పంట ఉత్పత్తులను తక్షణమే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం లేదా వర్షానికి తడవకుండా వాటిపై ప్లాస్టిక్ టార్పాలిన్లు కప్పి ఉంచడం మంచిది. లేకుంటే ఈ అకాలవర్షాల వలన రైతులు బారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. 

             

ముక్తాయింపు: క్రికెట్ గ్రౌండ్ లో వర్షం వస్తే పట్టాలతో కప్పి మరీ చినుకుపడనియకుండా చేసి ఆట ఆడించే ఈ రోజుల్లో..
మార్కెట్ యార్డులలో తినే తిండి గింజలు తడవకుండా చేయకపోవడం దురదృష్టకరం కదా!