రైతులకు సిఎం కెసిఆర్ మరో వరం!

మెదక్ పట్టణం శివారులో ఔరంగాబాద్ వద్ద సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ భవనాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం శంఖుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, “ఐ.ఏ.ఎస్.ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ రైతుల సంక్షేమం కోరుకొనే వ్యక్తిగా నాకు ఒక విషయం చెప్పారు. జిల్లాలో నీటి తీరువా బకాయిలు సుమారు 15-20 కోట్లు వరకు ఉన్నాయని, వాటిని మాఫీ చేసినట్లయితే రైతులు చాలా సంతోషిస్తారని చెప్పారు. అయన చాలా మంచి సూచన చేశారు. అందుకు ఆయనను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలకు మేలు చేయాలని ఆలోచించే ఇటువంటి అధికారులు మనకు ఉండటం చాలా అదృష్టం. అయన సూచన మేరకు రైతుల నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నాను.” 

“రాష్ట్రంలో రైతులందరివి కలిపి దాదాపు రూ.800 కోట్లు వరకు ఉండవచ్చని తేలింది. కనుక మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలో రైతులందరి నీటి తీరువా బకాయిలు పూర్తిగా రద్దు చేస్తున్నాను. అంతేకాదు..ఇకపై నీటి తీరువా పన్నును వసూలు చేయబోము. రైతులకు ఉచితంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వమే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దాని ఖర్చులు భరిస్తుంది. ఇక నుంచి రైతులు సాగునీటి కోసం ఒక్క పైసా ప్రభుత్వానికి చెల్లించనవసరం లేదు. ఇప్పటికే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. రేపే (గురువారం) రాష్ట్రంలో రైతులందరికీ రైతుబంధు చెక్కులను అందించే కార్యక్రమం మొదలవుతుంది. కనుక రాష్ట్రంలో రైతులు ఇకపై నిశ్చింతగా పంటలు పండించుకోవచ్చు,” అని సిఎం కెసిఆర్ అన్నారు.