10 వేల నకిలీ ఓటరు కార్డులు సీజ్!

మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. మరొక 3రోజులలో పోలింగ్ జరుగబోతుంటే, బెంగళూరులోని  ఒక అపార్ట్ మెంట్ లో ఏకంగా 10,000 ఓటర్ కార్డులు పట్టుబడ్డాయి. కర్ణాటకలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో  రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కొత్త ఓటర్ల పేర్లు నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. దాంతో అనుమానం వచ్చి ఆరా తీయగా జాలహళ్లి అనే ప్రాంతంలోగల ఒక అపార్ట్ మెంటులో నకిలీ ఓటర్ల పేర్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించి, ఆ అపార్ట్ మెంటు లో ప్రతీ ఫ్లాట్ ను గాలించగా ఒక ఫ్లాటులో 10,000 ఓటర్ కార్డులు పట్టుబడ్డాయి. వాటితో పాటు 5 ల్యాప్ టాప్స్, ఒక ప్రింటరును ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఒక స్థానిక కాంగ్రెస్ నాయకుడే ఆ నకిలీ కార్డులను సృష్టించాడని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇటువంటి అనైతికపనులకు సిద్దపడుతోందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.