సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మాక్ డ్రిల్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-రెతీ ఫైల్ బహుశః స్టేషన్ మద్య ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో స్థానిక పోలీసులతో కలిసి ఆక్టోపస్ దళాలు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఒకవేళ నిజంగా తీవ్రవాదులు ఆ గుడిలోపలకు ప్రవేశించి, భక్తులను బందీలుగా పట్టుకొని బాంబులతో విరుచుకుపడితే వారిని ఏవిధంగా ఎదుర్కోవాలనే శిక్షణలో భాగంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. 

మొదట తీవ్రవాదుల వేషంలో ఉన్న కొందరు ఆక్టోపస్ ప్రత్యేక పోలీస్ బృంద సభ్యులు ఆలయం లోపలకు జొరబడి భక్తులను బందీలుగా పట్టుకొన్నారు. మరొకరు ఆలయంలో కొన్ని చోట్ల నకిలీ బాంబులు పెట్టారు. అది చూసి ఆలయ అధికారులు వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు, ఆక్టోపస్ దళాలు అక్కడకు చేరుకొని ఆలయాన్ని చుట్టుముట్టి ఒక వ్యూహం ప్రకారం ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తరువాత తీవ్రవాదుల వేషంలో ఉన్న తమ సహచరుల చేతుల్లో బందీలుగా ఉన్న భక్తులను చాకచక్యంగా విడిపించారు. తరువాత వారు పెట్టిన నకిలీ బాంబులను నిర్వీర్యం చేశారు. అయితే ఈ మాక్ డ్రిల్ విషయం తెలియని భక్తులు, రోడ్డుపై సంచరిస్తున్న ప్రజలు చాలా ఆందోళన చెందారు కానీ ఆ తరువాత వారు కూడా ఆ వినోదం చూశారు.

గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో పోలీసులు, ఆక్టోపస్ దళాలు పాల్గొన్నాయి.