2.jpg)
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో పోలీస్, ఏసిబి, న్యాయనిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించడంపై అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ముందుగా స్పందించారు.
ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “నేను కెసిఆర్ తో, చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యక్షంగా పోరాడుతునందునే వారిరువురూ కలిసి మాపై కక్షసాధింపు చర్యలకు సిద్దం అవుతున్నారు. మోడీ డైరెక్షన్ లోనే కెసిఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పడానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశమే ఒక ఉదాహరణ. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులను కూడా క్షమించనని చెప్పిన కెసిఆర్, తన బంధువులు, తెరాస నేతలను కేసుల నుంచి బయటపడేయడానికే ఇప్పుడు ఉద్యమకేసుల మాఫీ చేస్తానంటున్నారు. కెసిఆర్ సమీక్షా సమావేశం తన రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టడానికేనని అర్ధమవుతూనే ఉంది. కానీ ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు నేను భయపడబోను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక ఈ ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య కూడా స్పందించారు. “ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేనప్పటికీ, తెదేపా, తెరాసలు నన్ను బలిపశువుని చేసాయి. కాంగ్రెస్, తెదేపాల ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రలోభాలు చూపకుండా తెరాసలోకి ఫిరాయించారంటే నమ్మశఖ్యంగా లేదు. అలాగే స్టీఫెన్ సన్ తో సహా ఇంకా అనేకమందిని తెదేపా ప్రలోభపెట్టి ఉండవచ్చు. వారి రాజకీయాలకు నన్ను బలిపశువుని చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సిబిఐకి అప్పగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడే నిజానిజాలు బయటపడతాయి,” అని మత్తయ్య అన్నారు.
ఈ కేసుపై కెసిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తేనే ఇంత రియాక్షన్ వచ్చింది. ఒకవేళ ఈకేసుపై మళ్ళీ ముందుకు సాగేందుకు ఏసిబికి కెసిఆర్ అనుమతిస్తే ఇంకెంత రియాక్షన్ ఉంటుందో ఊహించలేము. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలపై బ్రహ్మాస్త్రం వంటి ఈ కేసును ప్రయోగించి వారిని రాజకీయంగా దెబ్బ తీయాలని కెసిఆర్ ప్రయత్నిస్తే వారిరువురూ చూస్తూ ఊరుకోరని ఖచ్చితంగా చెప్పవచ్చు. చివరికి ఇది ఎటువంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈసారి తెరాస, తెదేపాల యుద్ధం మొదలైతే, వాటి మద్య రాయబారం చేయడానికి ఏ పెద్దమనిషీ లేడు...ఉన్నా రాలేడు.