
ఏదైనా ఒక వస్తువును భారతీయులు ఉపయోగించుకొన్నంత గొప్పగా మరే దేశస్తులు ఉపయోగించుకోలేరని నిరూపించే ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ లను కూడా ఎన్నివిధాలుగా ఉపయోగించుకొవచ్చో తెలుసుకోవాలంటే దాని మాన్యువల్ చూడటం కంటే, సగటు భారతీయుడిని అడిగితే అద్భుతమైన సలహాలు చెపుతాడు.
ఆ మద్యన రాజస్థాన్ లో ఒకరైతు పురుగుల మందును కలిపిన నీళ్ళను పాత ప్లాస్టిక్ బాటిల్స్ లో నింపి వాటిని డ్రోన్ వ్రేలాడదీసి, డ్రోన్ కెమెరాల ద్వారా పంటను పరిశీలించి చూస్తూ తనకు అవసరమైన చోట ఆ మందును పిచికారి చేస్తూ వార్తలకు ఎక్కాడు.
తాజాగా యూపిలో సీతాపూర్ అనే ప్రాంతంలో వీధికుక్కలను కనిపెట్టి పట్టుకొనేందుకు పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుక్కలను పట్టుకొనేందుకు బండి వేసుకొని వెళితే దానిని పసిగట్టి కుక్కలు పారిపోతుండటంతో మున్సిపల్ సిబ్బంది చేతులు ఎత్తేశారు. దాంతో వీధి కుక్కలను పట్టుకోవడానికి ఆ రాష్ట్ర డిజిపి ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలో దించారు. వారు నైట్ విజన్ ఉన్న అత్యాధునిక డ్రోన్ సాయంతో రేయింబవళ్ళు కుక్కలవేట సాగిస్తున్నారు. ఆ పరిసర గ్రామాలలో వీధి కుక్కలు కరవడంతో వారం రోజుల వ్యవధిలో ఆరుగురు పిల్లలు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు డ్రోన్ లను మన వీధికుక్కలమీద ప్రయోగించక తప్పడం లేదు. కనుక డ్రోన్లను ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చో అగ్రరాజ్యం మన దగ్గర తెలుసుకోవలసిందే.