అకున్...అప్పుడే మొదలెట్టేశాడు

పనిచేయాలనే తపన, సత్తా, నేర్పున్నవాడికి తీహార్ జైలులో వేసినా..పౌరసరఫరాల శాఖలో వేసినా ఆణిముత్యంలా మెరుస్తారని అప్పుడు..మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ నిరూపించగా, ఇప్పుడు..అకున్ సభర్వాల్ నిరూపించి చూపుతున్నారు. తనపని తీరుతో ఎక్సైజ్ శాఖకు ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన అకున్ సభర్వాల్ ఇటీవలే పౌరసరఫరా శాఖ కమీషనర్ గా బదిలీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. బాధ్యతలు చేపట్టగానే వెంటనే రంగంలో దిగిపోయారు. 

రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాలవర్షాలలో మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. అకున్ సభర్వాల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయించారు. 

అప్పటికప్పుడు 9 మంది ప్రత్యేకాధికారులను కూడా నియమించి వారికి జిల్లాలువారీగా ఈ తరలింపు కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ధాన్యం తడవడం వలన ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ముందు, మిల్లు యజమానులతో శుక్రవారం హైదరాబాద్ లోని పౌరసరఫర భవన్ లో సమావేశం నిర్వహించి వారి సహకారం కోరారు. 

మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగంగా ధాన్యాన్ని తెలంగాణా రైస్ మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలకు వస్తున్న కొత్తధాన్యాన్ని వీలైనంతవేగం కొనుగోలుచేసి గోదాములలో భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అయన జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను కూడా రైతులకు, తమ అధికారులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటి వరకు మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యంలో 1.16 లక్షల టన్నుల ధాన్యం ఈ అకాలవర్షాల కారణంగా తడిసిపోయిందని అకున్ సభర్వాల్ తెలిపారు. దానిలో ఎక్కువగా మంచిర్యాల, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జనగామ జిల్లాల నుంచి వచ్చినదే ఎక్కువని తెలిపారు. ఇక ముందు మళ్ళీ రైతులు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని తెలిపారు.