
హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న వాసంతి అనే మహిళా టెకీ అదృశ్యమైంది. రెండు నెలల క్రితమే ప్రదీప్ విశ్వనాథంతో ఆమె వివాహం జరిగింది. చంపాపేట్ లోని రాజిరెడ్డి నగర్లో వారు నివాసం ఉంటూ ఒకే సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. మే 2వ తేదీ ఉదయం 9గంటలకు ఆమె హైటెక్ సిటీలోని వేరే కంపెనీకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆమె కనబడటం లేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని వస్తోంది. దాంతో ఆమె భర్త ప్రదీప్, కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులు, తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళి వాకబు చేశారు. కానీ ఆమె ఎవరింటికీ రాలేదు. ఆమె భర్త ప్రదీప్ కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి వెళ్ళి నేటికి మూడు రోజులయ్యింది. ఆమె ఆచూకీ కోసం ఆమె భర్త ప్రదీప్, కుటుంబ సభ్యులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగర పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారలతో ఆమె కోసం గాలిస్తున్నారు.