రైతుబంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్దం

తెలంగాణా రాష్ట్రంలో సేద్యం చేస్తున్న ప్రతీ రైతుకి పంటపెట్టుబడిగా ఎకరాకు రూ.4,000 చొప్పున అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం మే 10వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ రైతు బంధు చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు, రైతులకు దీనిపై అవగాహనా సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. 

మే 10న చెక్కుల పంపిణీ చేయబోతున్నందున మే 8వ తేదీకే అన్ని  బ్యాంకులలో నగదు సిద్దంగా ఉండేవిధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ మొదటివిడత పంపిణీకిగాను రూ.4,114.62 కోట్లు బ్యాంకులలో సిద్దంగా ఉంది. దీనికోసం మరో రూ.2,000 కోట్లు అవసరం ఉంటుంది. దానిని కూడా మే 10లోగా సిద్దంగా ఉంచాలని కోరేందుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు మే 5న రిజర్వ్ బ్యాంక్ అధికారులను కలువనున్నారు.    

రైతుబంధు చెక్కులను ఎస్.బి.ఐ., కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, తెలంగాణా గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లలో నగదు రూపంలో మార్చుకొనేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మే 10వ తేదీనే చెక్కులతో పాటు రైతుల భూయాజమాన్య హక్కులను దృవీకరించే పాస్ పుస్తకాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది.

ఈ చెక్కులు, పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగలాగ ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కనుక రెవెన్యూ, వ్యవసాయం, ఆర్ధిక, పరిపాలనా శాఖల అధికారులు ఈ కార్యమమలో పాల్గొనబోతున్నారు. ఈ పధకం విజయవంతంగా అమలుచేయగలిగితే, తెరాసకు ఇక రాష్ట్రంలో తిరుగే ఉండదు.