ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి సబ్-కమిటీ ఏర్పాటు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు మంత్రులతో కూడిన ఒక సబ్-కమిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేశారు. ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు కేటిఆర్, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో వారు శుక్రవారం సమావేశమవుతారు. ఆ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు కూడా పాల్గొంటారని సమాచారం. ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లపై చర్చించిన తరువాత, మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒక నివేదికను సమర్పిస్తుంది. దాని ఆధారంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తుది నిర్ణయం తీసుకొంటారు. బహుశః రెండు మూడు రోజులలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 

ఉద్యోగుల సమస్యలలో ప్రధానంగా బదిలీలు, కొత్త పి.ఆర్.సి.ఏర్పాటు,భాగస్వామ్య పించన్ పధకం (సిపిఎస్) రద్దు, ఏపిలో పనిచేస్తున్న సుమారు 1,000 మంది తెలంగాణా ఉద్యోగులను రాష్ట్రానికి తిరిగి రప్పించడం వంటి 16 డిమాండ్లు ఉన్నాయి. వాటిపై ఈరోజు సబ్-కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తుంది.