
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్య రద్దు కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేయడానికి అనుమతి కోరుతూ 12 మంది తెరాస ఎమ్మెల్యేలు హైకోర్టులో ఒక పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు ఈ కేసులో వారు ప్రతివాదులుగా లేరు కనుక ఇప్పుడు దానిపై హైకోర్టు ధర్మాసనంలో అప్పీలు చేయవలసి వచ్చింది. వారి పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత తమ నిర్ణయాన్ని రిజర్వ్ లో ఉంచుతున్నట్లు తెలిపారు.
తెరాస ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ప్రముఖ న్యాయవాది వైద్యనాథ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. తెరాస ఎమ్మెల్యేలను ధర్మాసనంలో అప్పీలు చేసుకోవడానికి అనుమతించాలా లేదా అనే విషయంపై వాదనలు పూర్తయ్యాయి. దీనిపై త్వరలోనే న్యాయస్థానం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ తెరాస ఎమ్మెల్యేలను అనుమతిస్తే, ఈ కేసు మళ్ళీ మొదటికి వస్తుంది లేకుంటే తెరాస సర్కార్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.