
ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి (సమాజ్‌వాదీ పార్టీ అధినేత) అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్ వచ్చి సిఎం కెసిఆర్ తో ప్రగతిభవన్ లో భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకవిమానంలో అఖిలేష్ యాదవ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి ప్రగతి భవన్ తోడ్కొనిపోతారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనతో దేశరాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. భోజన విరామం తరువాత మళ్ళీ వారి చర్చలు కొనసాగుతాయి. అవి ముగిసిన తరువాత అఖిలేష్ యాదవ్ తలసాని యాదవ్ ఇంటికి వెళతారు. అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట విమానాశ్రయం చేరుకొని అఖిలేష్ యాదవ్ లక్నో తిరిగివెళ్ళిపోతారు.
మంత్రి కేటిఆర్ వారంరోజుల క్రితం డిల్లీ వెళుతూ మధ్యలో లక్నో వెళ్ళి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుకు సిఎం కెసిఆర్ కూడా లక్నో వెళ్ళాలనుకొన్నారు. కానీ అఖిలేష్ యాదవే దీని కోసం హైదరాబాద్ వస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ లో చేరదలచుకొన్న పార్టీల నేతలందరితో దాని విధివిధానాలు, కార్యాచరణ మొదలైన అంశాలపై లోతుగా చర్చించిన తరువాతే ఫ్రంట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని, ఈ ప్రక్రియ పూర్తవడానికి మరొక 2-3 నెలలు పట్టవచ్చునని సిఎం కెసిఆర్ స్వయంగా చెప్పారు. కనుక ఈరోజు కెసిఆర్-అఖిలేష్ భేటీ తరువాత కొత్తగా చెప్పే విషయాలు ఏవీ ఉండకపోవచ్చు.