వాళ్ళిద్దరూ ఏమీ పీకలేరు: కేటిఆర్

సిఎం కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాంలపై ఐటి మంటి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులదినం సందర్భంగా మంగళవారం తెలంగాణా భవన్ లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న సిఎం కెసిఆర్ ను విమర్శించడం, మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వారికి ఒక దురలవాటుగా మారిపోయింది. కాంగ్రెస్ హయంలో తెలంగాణాను అభివృద్ధి చేసి ఉండి ఉంటే, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయవలసిన అవసరమే ఉండేది కాదు కదా? వారి హయంలో తెలంగాణాను అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేము చేస్తున్నా సహించలేక అడ్డుకొంటున్నారు. అభివృద్ధిని అడ్డుకొంటూ మళ్ళీ అభివృద్ధి జరుగడం లేదని వాదించడం వారికే చెల్లు.

వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ కు ఆహ్వానిస్తున్నారే తప్ప కాంట్రాక్టర్లను కాదు. వారిని ప్రగతి భవన్ కు ఆహ్వానించి, కడుపునిండా అన్నంపెట్టి, వారి సమస్యలు అడిగి తెలుసుకొని, వారు ఊహించలేనంతగా జీతాలు పెంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. కార్మికులు, ఉద్యోగులతో ముఖాముఖి సమావేశమయ్యే ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడైనా ఉన్నారా?అటువంటి మంచి వ్యక్తిపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం బురదజల్లి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తుండటం చాలా దురదృష్టకరం. వారికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు.  అధికారం కోసం గెడ్డాలు పెంచుకొనేవారు, పాటకీలు పగులగోడుతామని ప్రగల్భాలు పలికేవాళ్ళు వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండాపోతారు, అని అన్నారు.