ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి జగదీశ్ తీవ్ర విమర్శలు

రాజకీయాలలో ఉన్నవారు అద్దాలమేడలో కూర్చొన్నట్లే లెక్క. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారు తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఒక రాయి విసిరితే, అటు నుంచి పదిరాళ్ళు పడే అవకాశం ఉంది. తెరాస ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశ్యించి “ఈ గులాబీ జెండా కారణంగానే నీకు ఆ పదవి వచ్చింది’ అని ఎద్దేవా చేశారు. ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకంటే ఘాటుగా సమాధానం చెపుతూ, “మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఇచ్చినందునే నీకు ముఖ్యమంత్రిపదవి, నీ కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు వచ్చాయి. తెలంగాణాలో ప్రజలు నానా కష్టాలు పడుతూనే విలాసవంతమైన రాజ మహల్ వంటి ప్రగతి భవన్ కట్టుకొని, తన స్వంత పనులకు కూడా ప్రత్యేక విమానాలలో తిరుగుతూ ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు,” అని తీవ్ర విమర్శలు చేశారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రతిపక్షాలు విమర్శిస్తే తెరాస నేతలు పట్టనట్లు చూస్తూ ఊరుకొంటారనుకోలేము. మంత్రి జగదీష్ రెడ్డి మళ్ళీ వాటికి సమాధానంగా ప్రతివిమర్శలు చేశారు. 

తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీలో పని చేసినప్పుడు కూడా ఇలాగే చిల్లరమల్లార పనులే చేసి ఉంటారని అనుమానం కలుగుతోంది. జీతం తీసుకొని ఆర్మీలో పనిచేసి అదేదో గొప్ప త్యాగం అన్నట్లు అయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎవరైనా డిల్లీ లేదా చైనా వెళ్ళాలంటే విమానాలలోనే వెళతారు తప్ప నడుచుకొని వెళ్ళరు కదా? ఇంత చినన్ విషయం తెలుసుకోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శించడం సరికాదు. అయన బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కు క్షమాపణలు చెప్పాలి,” అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.