
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెదేపా సోమవారం తిరుపతిలో ధర్మపోరాటం శంఖారావం పేరిట ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. గత ఎన్నికలలో ఇదే వేదికపై నుంచి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాజధాని నిర్మాణంతో సహా అనేకానేక హామీలు ఇచ్చారు. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంతవరకు వాటిలో దేనినీ అమలుచేయనందుకు నిరసనగా తెదేపా ఇవాళ్ళ తిరుపతిలో ధర్మపోరాటం బహిరంగాసభ నిర్వహిస్తోంది. దీని కోసం తెదేపా చాలా అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. ఈ సభను విజయం చేయడానికి తెదేపా నేతలు సుమారు లక్షన్నరమందిని సమీకరిస్తున్నట్లు సమాచారం.
అయితే రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్రం అమలుచేయలేదని ధర్మపోరాటం చేస్తున్నామని తెదేపా చెప్పుకొంటునప్పటికీ, తిరుపతి నుంచే తెదేపాకు ఎన్నికల ప్రచారం చేపట్టడం ఆనవాయితీగా పాటిస్తోంది కనుక వచ్చే ఎన్నికల కోసమే ఇప్పుడు తిరుపతి నుంచి శంఖారావం పూరిస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, ఇవ్వాళ జరుగబోయే సభతో తెదేపా-భాజపాల మద్య జరుగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారవచ్చు. ఇది భాజపా-వైకాపాలను కలిపినా ఆశ్చర్యం లేదు.