తెరాస వల్ల మాకు కాదు..మావల్లే మీకు ఆ పదవులు: ఉత్తమ్

కొంపల్లిలో జరిగిన తెరాస ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పార్టీపై, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పారు. 

గులాబీ జెండా కారణంగానే పిసిసి అధ్యక్ష పదవి లభించిందని కెసిఆర్ చేసిన విమర్శకు బదులిస్తూ, “తెరాస వలన నాకు పదవి లభించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం వలననే కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు లభించాయని అందరికీ తెలుసు,” అని అన్నారు. 

“నేను ఆంధ్రా నేతలకు సంచీలు మోసానో లేదో ప్రజలందరికీ తెలుసు. కానీ కెసిఆర్ తెలంగాణాను ఆంధ్రా కాంట్రాక్టర్లకు, బ్రోకర్లకు తాకట్టు పెడుతున్నారు. తెలంగాణా భవన్ లో సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు కానీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు, బ్రోకర్లకు, సినిమా హీరోలకు ప్రవేశం ఉంటుంది. కెసిఆర్ వారి నుంచి సంచీలు తీసుకొంటూ తెలంగాణాను వారికి తాకట్టు పెడుతున్నారు,” అని అన్నారు. 

“ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని నేను ఎన్నడూ అనలేదు కానీ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమంత్రి నివాసం కంటే గొప్పగా కట్టుకొన్నమాట నిజం కాదా? పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండదు. విద్యార్ధులకు ఫీజ్-రీఇంబర్స్ మెంట్ చేయడానికి డబ్బు ఉండదు. కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి రాజభవనాల వంటి ఇళ్ళు కట్టుకొంటారు. ఇంట్లో నుంచి కాలుబయటపెడితే మీకు ప్రత్యేక విమానాలు కావాలి. మీ విలాసాలకు ప్రజాధనం ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తూ మళ్ళీ మాపై ఆరోపణలు చేస్తారా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

తెరాస సర్కార్ ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని సస్యస్యామలం చేయాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేసి అడ్డుపడుతున్నారనే కెసిఆర్ ఆరోపణలపై స్పందిస్తూ, “ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో వేలకోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇవన్నీ తెలంగాణా రాష్ట్రానికి గుదిబండలుగా మారబోతున్నాయనే సంగతి ఇప్పుడు అర్ధం కాదు,” అని అన్నారు.