ప్రతీ ఏటా అదే సీన్స్ రిపీట్!

రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పధకాలు అమలుచేస్తున్నప్పటికీ, నేటికీ రైతుల సమస్యలు తీరడమేలేదు. రైతులు రోడ్లపైకి ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 

గత ఏడాది ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెంది మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేసి విద్వంసం సృష్టించడం, వారు ప్రతిపక్షాల కార్యకర్తలని ఆరోపిస్తూ అరెస్ట్ చేసి జైల్లో వేయడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే ఈ ఏడాది కూడా మళ్ళీ రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేయవలసిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమే.   

ఏప్రిల్ మొదటివారంలో జగిత్యాల జిల్లా మొక్కజొన్న రైతులు రోడ్లపై బైటాయించి ధర్నా చేశారు. దాని తరువాత నిజామాబాద్ ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం రోడ్లపై ఆందోళన చేసారు. వారి తరువాత వరంగల్ జిల్లా మొక్కజొన్న రైతులు, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ధాన్యం రైతులు ఆందోళన చేస్తున్నారు. 

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యానికి మద్దతుధర కల్పించాలని, మార్కెట్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వారు ఆగ్రహం పట్టలేక శుక్రవారం మార్కెట్ చైర్మన్, కార్యదర్శి కార్యాలయంపై దాడి చేసి విద్వంసం సృష్టించారు. కలెక్టర్ సురేంద్ర మోహన్ వచ్చి నచ్చచెప్పితేకానీ రైతులు శాంతించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,590 చెల్లిస్తామని కలెక్టర్ రైతులకు నచ్చజెప్పారు.