
‘భరత్ అనే నేను’ సినిమాపై ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ‘ఈనాడు’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ లో ఎంత హ్యూమర్ ఉందో మరోసారి బయటపడింది. కేటిఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరూ చాలా హాయిగా నవ్వుకొనేలా ఉన్నాయి.
భరత్ అనే నేను సినిమా హిట్ అవడం గురించి కేటిఆర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు సినిమా హిట్ అయ్యిందంటే 100 రోజులు ఆడింది లేదా 200 రోజులు ఆడిందని చెప్పుకొనేవారు. కానీ ఈరోజుల్లో 100..200.. కోట్లు కలెక్షన్స్ వసూలయ్యాయి అని చెప్పుకొంటున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది కనుక నాకు తెలియదు కానీ.. ఎన్నో కోట్లు వసూలు చేయాలని కోరుకొంటున్నాను,” అని అనడంతో మహేష్ తో సహా అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
మహేష్ బాబు తనను ‘సార్’ అని సంభోదిస్తుండటంతో “మహేష్...మీరు నన్ను ‘సార్’ అనిపిస్తుంటే మీ కంటే వయసులో చాలా పెద్దవాణ్ణనే ఫీలింగ్ కలుగుతోంది. మనిద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు కదా..సార్ అంటే ఎలాగ? అని కేటిఆర్ ప్రశ్నించినప్పుడు మళ్ళీ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
అలాగే ప్రేక్షకులలో ఒకమ్మాయి లేచి మాట్లాడుతూ, ఒకసారి తన స్నేహితులతో కలిసి మహేష్ బాబుతో సేల్ఫీ దిగుదామనివస్తే తమను బౌన్సర్స్ పక్కకు త్రోసేశారని, అప్పుడు మహేష్ బాబు వారిని వారించి తమతో సేల్ఫీ దిగారని చెప్పినప్పుడు, “మహేష్...కేవలం ఆడపిల్లలతోనే బౌన్సార్లను పక్కనపెట్టి సేల్ఫీలు దిగుతారా లేక మగపిల్లలకు కూడా ఛాన్స్ ఇస్తారా?” అని అన్నప్పుడు మహేష్ బాబుతో సహా అందరూ హాయిగా నవ్వుకొన్నారు. మహేష్ బాబు జవాబిస్తూ “లేదు అందరితో నేను సేల్ఫీలు దిగుతుంటాను. అభిమానులు..అభిమానులే కదా” అన్నారు. ‘కానీ నేను మీ మాటలను నమ్మను” అని కేటిఆర్ అనగానే అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
“మీరెప్పుడు రిలాక్స్ అవరా? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరా?” అనే ప్రశ్నకు, “నాకు రిలాక్స్ అవ్వాలనే ఉంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనే ఉంటుంది. కానీ వీలు పడటంలేదు. ఈ సినిమా చేసిన తరువాత మహేష్ బాబు ఫ్యామిలీతో హాయిగా విదేశాలకు టూర్ కొట్టి వచ్చేశాడు...మీరు మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్ళరు?అని మా ఇంట్లో వాళ్ళు నిలదీస్తున్నారు,” అని కేటిఆర్ అనగానే అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై కేటిఆర్ స్పందించిన తీరు, మాట్లాడిన తీరుతో అయన మహేష్ బాబుతో సమానంగా అందరినీ ఆకట్టుకోగలిగారు.