హైదరాబాద్ వాసులకు చిన్న శుభవార్త!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా జి.హెచ్.ఎం.సి. నగరంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లు, ఎక్స్ ప్రెస్ రోడ్లు, అండర్ పాస్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా ‘మైండ్ స్పేస్’ జంక్షన్ వద్ద నిర్మించిన అండర్ పాస్ రోడ్డును రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి శనివారం ప్రారంభించబోతున్నారు. రూ.25.87 కోట్లు వ్యయంతో నిర్మించబడిన ఈ అండర్ పాస్ రోడ్ 305 మీటర్ల పొడవు, 28.80 మీటర్లు వెడల్పు ఉంది. ఈ అండర్ పాస్ రోడ్ అందుబాటులోకి రావడంతో, సబర్ టవర్స్ నుంచి గచ్చిబౌలి, బయో డైవర్సిటీ పార్కు వైపు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ మార్గంలో సిగ్నల్స్ లేవు కనుక హాయిగా ముందుకు సాగిపోవచ్చు. 

ఇక అయ్యప్ప సొసైటీ వద్ద కూడా రూ.44.30 కోట్లు వ్యయంతో ఒక అండర్ పాస్ రోడ్ నిర్మించబడింది. దీనిని ఈ ఏడాది జనవరి 3వ తేదీన మంత్రి కేటిఆర్ ప్రారంభించడంతో అది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇంకా ఎల్.బి.నగర్ సర్కిల్, కూకట్ పల్లి చౌరస్తా, చింతల్ కుంట, నాగోల్ కామినేని చౌరస్తా, బైరామల్ గూడ, జూబ్లీ హిల్స్ రోడ్ నెం:45 మొదలైన ప్రాంతాలలో ఫ్లై ఓవర్లు, అండర్ ప్రతిష్టాత్మకమైన రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.