ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే...

కొంపల్లిలో ఈరోజు జరిగిన తెరాస ప్లీనరీలో సాగునీరు, వ్యవసాయ రంగం గురించి మనసుకు హత్తుకొనేలా చెప్పారు. ఒకప్పుడు కరెంటుకు, నీళ్ళకు కటకటలాడిన తెలంగాణాలో ఇప్పుడు నిరంతర విద్యుత్, అన్ని జిల్లాలకు మంచి నీళ్ళు, సాగునీరు సౌకర్యం కల్పించుకోగలిగామని అలాగే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే, దేశంలో 40 కోట్ల ఎకరాలకు నీళ్ళు అందించడానికి ఒక బృహుత్ ప్రణాళికను తయారు చేసి సిద్ధంగా ఉంచామని ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా జీవనదులు, వర్షాలు, మంచు కరగడం వల్ల సుమారు 70,000 టిఎంసిల నీళ్ళు అందుబాటులో ఉండగా, దానిలో కేవలం 40,000 టిఎంసిల నీటిని మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నామని కెసిఆర్ చెప్పారు. గత ఎదు దశాబ్దాలుగా మిగిలిన నీరు సముద్రం పాలవుతోందని, అయినా కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు దానిని సద్వినియోగం చేసుకోవడానికి కనీసం ఆలోచనా కూడా చేయలేదని అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకొనే ప్రయత్నం చేయకుండా, రాష్ట్రాల మద్య నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయంటూ ట్రిబ్యునల్స్ వేసి చేతులు దులుపుకొని చోద్యం చూస్తున్నాయని అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్, భాజపాలే నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్, భాజపాలకు కళ్ళు చెదిరిపోయేలా సాగునీరు, త్రాగునీటి ప్రాజెక్టులను చేపట్టి యావత్ దేశంలో నీటి ఎద్దడి లేకుండా చేసి చూపిస్తామని కెసిఆర్ శపథం చేశారు.