3.jpg)
తెరాస ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కెసిఆర్ భాజపా, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, భాజపాల వైఫల్యాలు, అలసత్వం, లోపభూయిష్టమైన ఆలోచనలు, విధానాల కారణంగానే నేడు భారతదేశం అత్యంత అవమానకర పరిస్థితులలో ఉంది. నేను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించగానే యావత్ దేశమూ ముఖ్యంగా కాంగ్రెస్, భాజపాలు ఉలిక్కిపడ్డాయి. ఇంకా టెంట్ కూడా ఏర్పాటుచేసుకోని ఫెడరల్ ఫ్రంట్ ను చూసి కాంగ్రెస్, భాజపా నేతలు ఎందుకు కంగారు పడుతున్నారంటే, ఆ ప్రతిపాదన చేసింది తెలంగాణా సాధించిన కెసిఆర్ గనుకనే! ‘కెసిఆర్ ఒక బక్కప్రాణి..కానీ చాలా మొండివాడు...పంతం పడితే వెనక్కు తగ్గడు...ఎత్తిన జెండా క్రిందకు దించడు’ అనే భయంతోనే ఆ రెండు పార్టీలు నా ప్రకటన విని ఉలిక్కిపడి నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నాయి.
అయితే తెలంగాణాలో పుట్టినందుకు ఏవిధంగా 14 ఏళ్ళు పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొని దాన్ని అభివృద్ధి చేసుకొంటున్నామో, అదేవిధంగా ఈదేశంలో పుట్టినందుకు భారతదేశాన్ని కూడా అన్నివిధాలుగా అభివృద్ధి చేసి, దేశంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించి ప్రపంచ దేశాలలో అగ్రదేశంగా నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. కనుకనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నాను.
దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై కోపం వస్తే భాజపాకి, భాజపాపై కోపం వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించవలసి వస్తోంది. అందుకే వాటి ఆటలు సాగుతున్నాయి. వాటి ఆటలు కట్టించాలంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరం. దీనిని దేశప్రజలందరూ అంగీకరించాలి. దేశంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తప్ప మరో పార్టీ, కూటమి పరిపాలన చేయలేని రాజకీయ వాతావరణాన్ని ఆ రెండు పార్టీలు సృష్టించాయి. దానిని నేను బద్దలుకొట్టి చూపిస్తాను.
దేశంలో అపారమైన నీటివనరులు, సహజవనరులు, మానవ వనరులు అన్నీ ఉన్నా దేశం ఇంత దయనీయమైన పరిస్థితులో ఉందంటే అందుకు ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, భాజపాలు సిగ్గుపడాలని కెసిఆర్ అన్నారు. కెసిఆర్ పూర్తి ప్రసంగ పాఠాన్ని మా ఫేస్ బుక్ పేజీ: https://www.facebook.com/mytelanganaa/ లో ఉంచిన వీడియోలో చూడవచ్చు.