వ్యవసాయ మంత్రి పదవి అంటే ఇష్టం: లక్ష్మీనారాయణ

ఇటీవల స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకొన్న మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మొట్టమొదటిసారిగా నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నేను ఏ రాజకీయ పార్టీలోను చేరలేదు కానీ మీడియానే నన్ను అన్ని పార్టీలలో చేర్చేసింది. అయితే నేను ఇప్పటికిప్పుడు ఏ పార్టీలోను చేరడం లేదు. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొన్నాక ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకొంటాను. వచ్చే ఎన్నికలలోగానే నిర్ణయించుకొంటాను. నా మనసులో ఒక కోరిక ఉంది. నాకు వ్యవసాయ మంత్రి పదవి లభిస్తే రైతులకు సేవ చేయాలని ఉంది. కానీ అధికారం, పదవులతో సంబంధం లేకుండా యధాప్రకారం నా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తాను. ఏపికి ప్రత్యేకహోదా లభిస్తేనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాను. కనుక ప్రత్యేకహోదా కోసం నేను కూడా పోరాడుతాను,” అని అన్నారు.