
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరిగిందా? అంటే జరిగినట్లే ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ ఒక ప్రైవేట్ చార్టెడ్ విమానంలో గురువారం ఉదయం బెంగళూరు నుంచి కర్ణాటకలో హుబ్బలికి వెళుతుండగా, అది హటాత్తుగా ఒక పక్కకు ఒరిగిపోయి బారీగా కుదుపులకు లోనయింది. ఆ తరువాత హటాత్తుగా దానంతట అదే గాలిలో క్రిందకు దిగజారిపోయింది. విమానం గాలిలో ప్రయాణిస్తుండగా దాని ఎడమవైపు ఇంజను ఉండే భాగంలోనుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని దానిలో ప్రయాణించిన రాహుల్ గాంధీ అనుచరుడు కౌశల్ కె విద్యార్ధి చెప్పారు. దాదాపు 40 నిమిషాల సేపు ఇదే పరిస్థితిలో విమానం ముందుకు సాగిందని చెప్పారు. విమాన పైలట్లు అతికష్టం మీద దానిని హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా దించడంతో రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడగలిగారు.
ప్రైవేట్ ఛార్టెడ్ విమానంలో ఇటువంటి సమస్య తలెత్తడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విమానంలో రాహుల్ గాంధీతో పాటు ప్రయాణించిన కౌశల్ కె విద్యార్ధి కర్ణాటక రాష్ట్ర డిజి &ఐజి ఆఫ్ పోలీస్ నీలమణి ఎన్.రాజుకు దీని గురించి లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తడం కుట్రగా భావిస్తున్నమని కనుక ఇది కేవలం సాంకేతిక సమస్యా లేక ఎవరైనా రాహుల్ గాంధీని అడ్డు తొలగించుకొనేందుకు ఆటో-పైలట్ వ్యవస్థను ఉద్దేశ్యపూర్వకంగా చెడగొట్టారా? అని తన పిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయవలసిందిగా కోరారు.
డిజిపి ఆదేశాల మేరకు హుబ్బలి డిసిపి రేణుక సుకుమార్ వెంటనే ఆ విమాన పైలట్, కో-పైలట్ ఇద్దరినీ తన కార్యాలయానికి పిలిపించుకొని ప్రశ్నించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం నిజమే కానీ ఈ సంఘటన గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ప్రధాన పైలట్ జగత్ సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ తాము సురక్షితంగా విమానాన్ని హుబ్బలి విమానాశ్రయంలో దించమని చెప్పారు. విమానం ఆటో-పైలట్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగానే ఈవిధంగా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో రాహుల్ గాంధీ, అయన అనుచరుడు కౌశల్ కె విద్యార్ధి, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వారు బెంగళూరు నుంచి హుబ్బలి వెళుతుండగా నిన్న ఉదయం 10.45 గంటలకు జరిగింది. దాదాపు 40 నిమిషాలసేపు విమానం గాలిలో ఊగిసలాడుతూ ప్రయాణించి 11.25 గంటలకి హుబ్బలి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిజానిజాలు కనుగొంటామని కర్ణాటక డిజిపి నీలమణి ఎన్.రాజు చెప్పారు.