రాహుల్ వస్తే బస్సులో చోటు ఉండదేమో?

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత  మొట్టమొదటిసారిగా జూన్ మొదటివారంలో రెండు రోజులు తెలంగాణాలో పర్యటనకు రాబోతున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టి-కాంగ్రెస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో, ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగసభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ బస్సు యాత్రకు రోడ్ మ్యాప్, బహిరంగ సభలకు షెడ్యూల్, వేదికలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 

బస్సుయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తే, దాంతోనే పార్టీలో నేతల మద్య గొడవలు బయటపడుతున్నాయి. ఈ బస్సు యాత్రలతో పార్టీ ఆశించిన ప్రయోజనం కలుగకపోగా తమ మద్య నెలకొన్న అభిప్రాయభేదాలను ప్రజలకు, తమ రాజకీయ ప్రత్యర్ధులకు చాటి చెప్పుకోవడానికే యాత్రలు చేస్తునట్లవుతోంది. నేతల మద్య అభిప్రాయభేదాల కారణంగా కొన్నిసార్లు బస్సు యాత్రలను వాయిదా వేసుకోవలసివచ్చింది. కొన్ని ప్రాంతాలలో నేతల సహకారం లభించకపోవడంతో ప్రజల నుంచి స్పందన రాలేదు. కొన్నిచోట్ల నిర్వహించిన సభలలో స్థానిక నేతలు కీచులాడుకొన్నారు. అది చూసి తెరాస నేతలు టి-కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేస్తున్నారు కూడా. 

అయితే ఇంతవరకు బస్సు యాత్రకు మొహం చాటేస్తున్నవారు, దానికి సహకరించని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చినప్పుడు ఆ బస్సులో సీటు కోసం, బహిరంగసభలలో వేదికలపై రాహుల్ గాంధీ పక్కన చోటు సంపాదించుకోవడానికి గట్టిగానే ప్రయత్నించవచ్చు. కనుక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ బస్సులో డ్రైవర్ సీటు కూడా ఖాళీ ఉండకపోవచ్చు. 

టి-కాంగ్రెస్ నేతల ఈ తీరు చూస్తుంటే మంత్రి హరీష్ రావు అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వారెప్పుడు సీట్ల కోసం కొట్లాడుకొంటూనే ఉంటారు. ప్రజలు, పాలన వారికి అవసరం లేదు. టికెట్లు, సీట్లు, అధికారం ఈ మూడే వారికి ముఖ్యం,” అని అన్నారు. అది నిజమేనేమోననిపిస్తోంది.