2019లో సిఎం నేనే అంటున్న ‘రెడ్డిగారు’

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఈ మధ్యనే బ్రిటిష్ వాళ్లు కూడా తన సలహాలు తీసుకుంటారని చెప్పిన జానా.. తాజాగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న సిఎంతో సమానంగా హోదాను కలిగి ఉన్న ఏకైక నాయకుడిని నేనే అని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్ని మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేస్తే ఫలితాలు మాత్రం అధికార పార్టీ వారు మేమే సాధించామని చెప్పుకుంటున్నారని, ఇది విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మారిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ మారిన వారు పశ్చాతాప పడక తప్పదన్పారు. అప్పుడు పశ్చాతాప పడినా ఫలితం ఉండదని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని జోష్యం చెప్పారు.

ప్రస్తుతం పార్టీ మారిన వారిని నేనే మారమని చెప్పినట్లు కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని నేను ఎవరిని పార్టీ మారమని చెప్పలేదని,అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు.అంతే కాకుండా నేను ప్రధానమంత్రి తో మాట్లాడగల స్థాయి ఉన్న వ్యక్తినని వీళ్లతో(టీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి) ఏమి చెప్పినా ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేరని అన్నారు.అవినీతి పైరవి కారులతో, నాయకులతో జాగ్రత్తగా ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ 2019 లో అధికారంలోకి రావడం ఖాయం అని అప్పటి దాకా కార్యకర్తలు సమ్యమనం పాటించాలని అన్నారు. మొత్తానికి జానారెడ్డి గురించి ఎవరూ మాట్లాకపోవడంతో చివరకు తన డబ్బా తానే కొట్టుకుంటున్నారని రాజకీయ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.