పేదలకు సౌకర్యంగా ఉండండంతోపాటు.. సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసేలా ఇసుక సరఫరా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. స్ధానిక అవసరాల కోసం దగ్గరలోని రీచ్ ల నుంచి ఇసుక తరలించేందుకు కలెక్టర్లకే పూర్తి అధికారులు కల్పిస్తామన్నారు. అంతర్ జిల్లాలకు రవాణా చేసే లారీల విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేయాలని చెప్పారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇంటి నిర్మాణాలకు స్థానికంగా దొరికే ఇసుక సరఫరా చేసుకుంటే ఫర్వాలేదు కానీ. అదే ట్రాక్టర్లతో ఇతరప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకోవద్దని చెప్పారు.
అలాగే స్థానికంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే ఇసుక సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్లకి ఆదేశించారు. కేటీఆర్. ఇందుకోసం జిల్లాలోని ఇంజినీరింగ్ సిబ్బందితో రెగులర్ గా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.ఇక మైనింగ్ అక్రమాలు, ఆగడాలను పూర్తిగా అరికడతామన్నారు మంత్రి. గనుల నిర్వహణతో ప్రభుత్వాదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే మైనింగ్ ఆదాయంలో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ఏడాదికన్నా 41 శాతం అదాయంతో రాష్ట్రానిదే పైచేయిగా ఉందన్నారు. అలాగే పదుల సంఖ్యలో వేబ్రిడ్జిలు ఏర్పాటు చేసి ఓవర్ లోడింగ్ సమస్యకు కూడా చెక్ పెట్టాలని చెప్పారు. రోబో సాండ్ ఉపయోగాన్ని కూడా పెంచడానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామని చెప్పారు కేటీఆర్. దీని ఉత్పత్తిని నిరుద్యోగ యువతకు ఇవ్వడం ద్వారా.. వారికి ఉపాధిని కల్పిస్తామన్నారు.