
హైదరాబాద్ లో 5 రోజుల పాటు సాగిన సిపిఎం పార్టీ 22వ మహా సభలు ఆదివారం సాయంత్రం సరూర్ నగర్ మైదానంలో జరిగిన బారీ బహిరంగసభతో విజయవంతంగా ముగిసాయి. ఈ మహాసభల ముగింపు సందర్భంగా సిపిఎం నూతన కేంద్రకార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 17మంది సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరోను, 95మంది సభ్యులు గల కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు. సిపిఎం జాతీయకార్యదర్శిగా సీతారాం ఏచూరిని ఎన్నికయ్యారు. ఆయన వరుసగా రెండవసారి ఎన్నికవడం విశేషం.
కేంద్రకమిటీలో తెలంగాణా రాష్ట్రం నుంచి తమ్మినేని వీరభద్రం, చెరుకుపల్లి సీతారాములు, వీరయ్య, జి.నాగయ్యలకు, ఆంధ్రప్రదేశ్ నుంచి పి.మధు, ఎం.ఎ.గఫూర్, వి.శ్రీనివాసరావులకు స్థానం కలిపించారు. ఇప్పటికే జాతీయస్థాయి పార్టీ వ్యవహారాలను చూస్తున్న ఏపికి చెందిన హేమలత, పుణ్యవతి, అరుణ్ కుమార్ లకు కూడా ఈ కేంద్రకమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు.
సరూర్ నగర్ లో జరిగిన ముగింపు సభకు ఊహించని స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావడంతో సరూర్ నగర్ మైదానం నిండిపోయింది. బహిరంగ సభ సందర్భంగా ఎర్రదుస్తులు ధరించిన 10,000 మంది కార్యకర్తలు నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకొంది.
ముగింపు సభలో మాట్లాడిన సిపిఎం నేతలందరూ మోడీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలవలన దేశానికి, ప్రజలకు చాలా నష్టం కలుగుతోందని కనుక ఎన్డీయే కూటమిని, భాజపాను గద్దె దించవలసిన అవసరం ఉందని గట్టిగా నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయం గురించి ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకొంటామని సీతారాం ఏచూరి చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విధివిధానాలు ప్రకటించిన తరువాత దానిలో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకొంటామని తెలిపారు.
ఈ మహాసభలకు సీతారం ఏచూరి, త్రిపుర మాజీ ముఖ్యమంత్రిమాణిక్ సర్కార్, బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, కేరళ సిఎం పినరయి విజయన్, ప్రకాష్ కారత్, బృందా కారత్ తదితర అనేకమంది ప్రముఖనేతలు హాజరయ్యారు.