ఆరునెలల పసిపాపను కూడా వదలరా?

అదేదో అంటువ్యాధిలాగ ఉత్తరాది రాష్ట్రాలలో అభంశుభం తెలియని ఆడపిల్లలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయిప్పుడు. జమ్ము కాశ్మీర్ లో కధువాలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, హత్యతో మొదలైన ఈ అంటురోగం అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. 

మనిషిగా పుట్టినవాడు ఎవడూ చేయకూడని దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరిగింది. తల్లి పక్కన నిద్రిస్తున్న 6 నెలల పసిపాపను ఒక మానవమృగం ఎత్తుకుపోయి అత్యాచారం చేసి తరువాత హత్య చేసింది. 

ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇండోర్ నగరంలో రాజ్ వాడ కోట వద్ద ఫుట్ పాత్ పై తల్లితండ్రుల పక్కలో నిద్రిస్తున్న ఒక ఆరు నెలల చిన్నారిని సునీల్ భీల్ అనే ఒక 21 ఏళ్ళ కామాంధుడు ఎత్తుకుపోయి, అక్కడే ఉన్న ఒక అపార్ట్ మెంట్ సెల్లారులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసిన తరువాత నేలపై విసిరేయడంతో సున్నితమైన ఆమె తలకు తీవ్రగాయమై చనిపోయింది. సిసి టీవీలలో రికార్డైన వీడియో ఆధారంగా పోలీసులు ఈ విషయం కనిపెట్టి అతని కోసం గాలిస్తున్నారు.