అనుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర సర్కార్ విద్యుత్ ఛార్జీల మోత మోగించింది. ముందు నుండి వినిపిస్తున్న విద్యుత్ ఛార్జీల పెంపుదలపై సర్కార్ మొత్తానికి నిర్ణయం తీసుకుంది. వేసవితో గత రెండు సంవత్సరాలుగా దాదాపుగా విద్యుత్ కోతలు లేకుండా చూసిన తెలంగాణ సర్కార్ కు విద్యుత్ ఛార్జీల పెంపుదల తప్పనిసరిగా మారింది. దాంతో సిఎం కేసీఆర్ సమాన్యుడి మీద భారం పడనట్లుగా విద్యుత్ ఛార్జీలను పెంచాలని సూచించారు. అందుకే వంద యూనిట్లలోపు వాడే గృహ వినియోగదారులకు అదనంగా ఎలాంటి భారాన్ని మోపలేదు. కాగా తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో ప్రభుత్వం సంవత్సరానికి 1527 కోట్లు వెనకేయనుంది.
తెలంగాణ సర్కార్ వంద యూనిట్లకు మించితే అంటే 100 నుండి 200 యూనిట్లకు 3రూపాయల 60పైసలు నుంచి రూ 4రూపాయల 30పైసలకు, 200 నుండి 300 యూనిట్లకు 6రూపాయల 80పైసల నుండి 7రూపాయల 20పైసలకు పెంచింది. 300 నుండి 400 యూనిట్లకు 7రూపాయల 80పైసల నుండి 8రూపాయల 50పైసలు, 400 నుండి 800 యూనిట్లకు 8రూపాయల 50పైసల నుండి 9 రూపాయలకు చార్జీలు పెంచింది. ఇక పరిశ్రమలకు యూనిట్‌కు 6రూపాయల 40పైసల నుంచి 6రూపాయల 70పైసలు, చక్కెర పరిశ్రమలకు యూనిట్‌కు 4రూపాయల 90పైసల నుంచి 5రూపాయల 20పైసలు, కోళ్ల పరిశ్రమలకు యూనిట్‌కు 3రూపాయల 60పైసలునుంచి 4రూపాయలకు ఛార్జీలను పెంచింది. పెరిగిన విద్యుత్ ధరలు జులై1 నుంచి అమల్లోకి రానున్నాయి.