తెలంగాణలో ఒకేసారి రెండు ఛార్జీలు పెంచారు. అటు విద్యుత్, ఇటు బస్ ఛార్జీలు. అయితే ఈ రెండింటిని పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ సర్కార్ కు. ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. పల్లె వెలుగు బస్సులకు 30 కిలోమీటర్ల వరకు రూ.1 పెరగనుంది. ఆ పై వచ్చే స్టేజికి రూ.2 పెరగనుంది. అలానే మిగతా ఆర్టీసీ బస్సులకు 10 శాతం ఛార్జీలను పెంచనుంది. నష్టాల నుంచి బయటపడేందుకే ఈ పని చేసినట్లు చెబుతుంది సర్కారు. పెంచిన ఛార్జీలతో రూ.286 కోట్ల ఆదాయం రాబోతుంది.
ఆర్టీసీ నష్టాల మీద దృష్టిసారించిన కేసీఆర్, ఈ మధ్యనే ఆర్టిసి కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. నష్టాల ఆర్టీసి దిశను మార్చాలని కేసీఆర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కాగా తాజాగా పెంచిన బస్ ఛార్జీల ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల ముందే ఫీలర్ వదిలింది. ఇందుకు ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాక పోవడంతో పెంపుకే మొగ్గు చూపింది. సహజంగానే ఆర్టీసీ ఛార్జీల పెంపును విపక్షాలు వ్యతిరేకించాయి.