ఢిల్లీలోని గత హైదరాబాద్ రాష్ట్ర, ప్రస్తుత ఏపి భవన్ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజాం కాలంలో 1917, 1928, 1936లో మూడువిడతలుగా కొనుగోలు చేసిన భూములు.. తెలంగాణకే చెందుతాయని.. వాటిని వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరుతూ కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ కు లేఖరాశారు సీఎం. మూడు విడతలుగా కొన్న 18.18ఎకరాల భూమి.. నిజాంకాలం నుంచి హైదరాబాద్ రాష్ట్ర అధీనంలోనే ఉందని.. 1956లో ఆంధ్ర, హైదరాబాద్ కలిశాక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందనీ.. మళ్లీ 2014లో తెలంగాణ విడిపోయింది కాబట్టి ఈ భూములపై ఏపీకి ఎలాంటి హక్కు లేదన్నారు కేసీఆర్.
విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన భవనాన్ని పంచారని అన్నారు. కానీ ఏపీకి వేరేచోట భూమిని కేటాయించి.. స్థలాన్ని తమకు అప్పజెప్పితే డెవలప్ మెంటు పనులు, అన్ని హంగులతో తెలంగాణ భవన్ నిర్మించుకుంటామని లేఖలో తెలిపారు. హైదరాబాద్ హౌస్ ను కేంద్ర స్వాధీనం చేసుకుని.. అందుకు ప్రతిఫలంగా పటౌడీ హౌస్ లో 7.56 ఎకరాలు నర్సింగ్ ఇనిస్టిట్యూట్ లో 1.21 ఎకరాలు.. ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి హైదరాబాద్ సంస్థానాధీనంలో ఉన్న ఈ భూములపై ఇపుడు సర్వ హక్కులు తమవే అన్నారు సీఎం. ఈ విషయంలో కేంద్ర చొరవ చూపించి భూములు స్వాధీన పర్చాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కేసీఆర్.