మెట్రో రైల్ కబుర్లు

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు నగరవాసులకు, పర్యాటకులకు చాలా సౌకర్యవంతంగా ఉండటంతో వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రెండు కారిడార్లలో కలిపి రోజుకు 60,000 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అది ఊహించిన దానికంటే చాలా తక్కువే కానీ మున్ముందు మిగిలిన కారిడార్లు కూడా అందుబాటులోకి వస్తే నగరంలో అన్ని ప్రాంతాలు అనుసంధానం అవుతాయి కనుక అప్పుడు మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. 

ఇక అసలు విషయం ఏమిటంటే, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెట్రో రైళ్ళ వేగం, ఫ్రీక్వెన్సీ పెంచాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాగోల్-అమీర్ పేట మార్గంలో ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తోంది. అలాగే రైలు వేగం కూడా తక్కువగా ఉంది. కనుక ఆ మార్గంలో ప్రతీ 5 లేదా 8 నిమిషాలకు ఒక రైలును నడిపించి, రెండు కారిడార్లలో రైళ్ళ వేగం పెంచాలని మెట్రో అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మియాపూర్-అమీర్ పేట మద్య దూరం తక్కువ కనుక రైళ్ళ వేగం పెంచితే సరిపోతుందని భావిస్తున్నారు. 

ఇక ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 9వ తేదీ నుంచి 20-20 ఐపిఎల్ మ్యాచ్ లు జరుగబోతున్నాయి కనుక మ్యాచ్ జరిగినన్నాళ్ళు రెండు కారిడార్లలో రాత్రి 12.30 వరకు మెట్రో రైళ్ళను నడిపించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు.  నేడోరేపో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.