ఇది నిజమా?

మన రాజకీయ నేతలు అవకాశం చిక్కితే గాంధీజీ, బాబాసాహెబ్ పేర్లను అలోకగా వాడేస్తుంటారు. కానీ ఏ ఒక్క నేత కూడా వారు చూపిన మార్గంలో నడవడంలేదని అందరికీ తెలుసు. కనీసం వారి వారసులకైనా న్యాయం చేయగలుగుతున్నారా...అంటే అదీలేదు. 

కుమరం భీమ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆ ఆదివాసి పోరాటవీరుడి గౌరవార్ధం రాష్ట్రంలో ఒక జిల్లాకు అయన పేరు పెట్టింది ప్రభుత్వం.  రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలో జోడేఘాట్ ను సందర్శించినప్పుడు కుమరం భీమ్ వారసులలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయన మునిమనుమరాలైన వరలక్ష్మికి ప్రభుత్వోద్యోగం పొందేందుకు అన్ని అర్హతలు ఉండటంతో ఆమెకు ఉద్యోగం కల్పించడానికి 2014లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏ2/25/258/2014 ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 

ఆమెకు ఐటిడిఏలో ఉద్యోగం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఖాళీలు లేకపోవడంతో తాత్కాలికంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు చెప్పారు. కానీ అవుట్ సోర్సింగ్ పద్దతిలో తిర్యాణి మదలంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించారు. ఆ తరువాత ఆమె అభ్యర్ధన మేరకు జైనూరు గిరిజన ఆశ్రమ పాఠశాలకు బదిలీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఆమె అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగానే పనిచేస్తున్నారు తప్ప  ప్రభుత్వోద్యోగం రాలేదు. అయితే ప్రతీనెలా రూ.14,000 జీతం మాత్రం ఇవ్వడమే ఆమెకు కాస్త ఉపశమనం కలిగించే విషయం. తనకు ప్రభుత్వోద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని కానీ మద్యలో అధికారులు ఎందుకు అడ్డుపడుతున్నారో తనకు తెలియడం లేదని, నాలుగేళ్ళుగా అధికారుల చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరిగినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.