తెరాసలో మా పరిస్థితి బాలేదు: ఎమ్మెల్యే భాస్కర్ రావు

రెండేళ్ళ క్రితం ‘బంగారి తెలంగాణా సాధన కోసం రాజకీయ పునరేకీకరణ’ పేరిట జరిగిన పార్టీ ఫిరాయింపులలో అనేకమంది కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. వారిలో అతికొద్ది మంది గొంతు మాత్రమే వినిపిస్తుంటుంది. మిగిలినవారు తెరాసలో చేరిన తరువాత తమ ఉనికిని కోల్పోయారు. కానీ ఇంతకాలం ఎవరూ ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఒకరొకరే గొంతు సవరించుకొని మాట్లాడుతున్నారు. 

ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో రోడ్ల నిర్మాణం గురించి సభ్యులు ప్రశ్నలడుగుతున్నప్పుడు, తెరాసలో చేరిన కాంగ్రెస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ కు షాక్ ఇచ్చారు. “తెరాసలో చేరిన మావంటివారిని పార్టీలో నేతలు చులకనగా చూస్తున్నారు. మా ప్రాంతంలో బిటి రోడ్ల నిర్మాణాలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వంలో పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు” అని అన్నారు.