‘నో బిల్..ఫ్రీ ఫుడ్’ సాధ్యమేనా?

రైలు ప్రయాణికులకు నాసిరకం ఆహార పదార్ధాలను సరఫరా చేస్తున్నందుకు రైల్వే కాంట్రాక్టర్ ను సలసల మరుగుతున్న నూనెలో ముంచి చంపాడు ‘అపరిచితుడు.’ అది సినిమా. అయినప్పటికీ ఆ సినిమాలో హీరో చేసిన అటువంటి పనులన్నీ సామాన్య ప్రజల ఆగ్రహాన్ని చక్కగా ప్రతిబింబించాయి కనుకనే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంత మాత్రాన్న మన వ్యవస్థా మారలేదు...దానిలో దోపిడీ ఆగిపోలేదనే సంగతి అందరికీ తెలుసు. 

ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకు నాసిరకం ఆహార పదార్ధాలను సరఫరా చేసి, నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ గుంజుతున్న రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మన భారతీయ రైల్వేలలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారిని నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ ఇంతకాలం రైల్వే అధికారులు పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక ప్రయాణికులు కూడా మౌనంగా జేబులు ఖాళీ చేసుకొంటున్నారు. 

రైళ్ళలో జరుగున్న ఈ దోపిడీపై ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. ఇక నుంచి, రైళ్ళలో సరఫరాచేసే టీ, కాఫీల మొదలు ప్రతీ ఆహార పదార్ధానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని లేకుంటే వాటికి ప్రయాణికులు డబ్బు చెల్లించనవసరం లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు రైల్వేశాఖ తన అధికారిక ఐ.ఆర్.సిటి.సి వెబ్ సైట్లో దానికి సంబంధించిన వివరాలను ఉంచింది. ఇకపై రైళ్ళలో ఫుడ్ ఇన్స్పెక్టర్లను కూడా నియమించి, వారి ద్వారా ఎప్పటికప్పుడు ఆహార పదార్ధాల నాణ్యత తనికీలు చేయిస్తూ ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు పేర్కొంది.

ఇది చాలా మంచి నిర్ణయమే. అయితే అవినీతి, అడ్డుదారిలో సంపాదనకు కక్కుర్తిపడే అలవాటుపడిన రైల్వే కాంట్రాక్టర్లను గాడిన పెట్టడం అంత తేలిక కాదనే సంగతి అందరికీ తెలుసు. ప్రయాణికులు కూడా ధైర్యంగా వారిని నిలదీసి అడిగినప్పుడే మార్పు సాధ్యం అవుతుంది. వారిలో అంత చైతన్యమే ఉండి ఉంటే, ఈ నిబంధన అవసరం పడేదేకాదు కదా!