తెలుగు రాష్ట్రాలకు కృష్ణ రివర్ బోర్డ్ ఝలక్

తెలుగు రాష్ట్రాల మధ్య ఖచ్చితంగా జలవివాదాలు వస్తాయని రాష్ట్రాల ఏర్పాటుకు ముందే చాలా మంది హెచ్చరించారు. నీటిరంగంలో నిపుణులు కూడా అవును అనేలా.. తాజాగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. కానీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన కృష్ణ బోర్డు వ్యవహారం మొత్తం కృష్ణార్పణం అన్నట్లు వ్యవహరిస్తోంది.

మీ నీళ్లు మీరే పంచుకోండి అంటూ ఆప్షన్ ఇచ్చిన కృష్ణ బోర్డు, ఇందుకు నెలరోజుల టైమ్ కూడా సెట్ చేసింది. ఢిల్లీలో జరిగిన కృష్ణ రివర్ బోర్డ్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.  వరుసగా రెండో రోజు కూడా సమావేశమైన బోర్డు, తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

నీటి వాటాలపై మీరే తేల్చుకోవాలని ఏపీ, తెలంగాణలకు సూచించింది. నెలరోజుల్లోగా చర్చించుకొని నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇప్పుడు అమల్లో ఉన్న వాటాలనే కొనసాగించాలని నిర్ణయించింది.  ఈ సమావేశంలో రివర్ బోర్డ్ సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణం ద్వారా మళ్లించే 45టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ కోరింది. అయితే దీనికి ఏపీ నిరాకరించింది.

మరోవైపు బోర్డు పరిధిని ఫైనల్ చేసి దీనిపై నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేసింది. లేదంటే తమ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ వార్క్స్ ను తామే నిర్వహించుకుంటామని స్పష్టం చేసింది. దీనికి తెలంగాణ ససేమిరా అంది. ఏ రాష్ట్రానికి చెందిన భూభాగంలోని ప్రాజెక్టులను వారే నిర్వహించుకుంటామని ఏపీ వాదించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నదీజలాల వివాదంపై ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం గడువిచ్చి వదిలేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్య నెలరోజుల్లో పరిష్కారం అవుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.