తరువాత నవీన్ తో కెసిఆర్ చర్చలు?

ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుకు సోమవారం కోల్ కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో     చర్చించిన కెసిఆర్, తరువాత భువనేశ్వర్ వెళ్ళి ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో చర్చించబోతున్నట్లు తాజా సమాచారం. దీని కోసం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల తెరాస ప్లీనరీ సభల హడావుడి ఉంటుంది కనుక ఈలోగానే ముఖ్య నేతలందరినీ కలిసే అవకాశం ఉంది. ఓడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ (బిజెడి) కాంగ్రెస్, భాజపాలు రెంటినీ తన రాజకీయ శత్రువులుగానే భావిస్తోంది. కనుక ఆ రెండు పార్టీలు 2019 ఎన్నికలలో బిజెడిని ఓడించాలని పట్టుదలగా ఉన్నాయి. ఒకప్పుడు బిజెడికి మిత్రపక్షంగా ఉన్న భాజపా ఓడిశాలో పాగా వేయాలని చాలా పట్టుదలగా ఉంది. కనుక ఆ రెంటినీ బిజెడి ఒంటరిగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో వస్తునందున బిజెడి తప్పకుండా దానిలో భాగస్వామిగా చేరే అవకాశం ఉంటుంది.