తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తారా స్థాయికి చేరాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ఏపి నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. కొత్తగా నిర్మించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని కేటాయించడానికి వీలులేదని ఆయన అన్నారు. తెలంగాణ వాటాకు వచ్చే ఒక నీటి చుక్కను కూడా తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఏపి తీరుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
ఒకే ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు నిర్వహించుకోవడం దేశంలో ఎక్కడా లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. కృష్ణా జలాలపై ఏపీ మొండివైఖరిని వీడాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరితే ఆంధ్రప్రదేశ్ పెడచెవిన పెడుతోందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని.. ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్దం అని కూడా ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు పంటలకు నీళ్లు ఉంటున్నాయని.. తమకు ఒక పంటకు నీళ్లు అడిగితే ఏపీ ప్రభుత్వం ఓర్వలేకుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటి లభ్యతపై స్వతంత్ర కమిటీ వేసి తెలంగాణకు అందులో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను కేంద్రం ఎప్పుడూ చిన్నచూపు చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. పోలవరం ముంపు గ్రామాలను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరిలో మార్పు రాకుంటే పోరాటం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.