ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ధర్డ్ ఫ్రంట్ గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు ఈరోజు కోల్‌కతాకు వెళ్ళబోతున్నారు. ఉదయం 11.30 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని అవి ముగిసిన తరువాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. తెరాస రాజ్యసభ సభ్యుడు కె కేశవ్ రావు, ఎంపి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ మరికొంతమంది ముఖ్య నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ బెంగాల్ హోటల్ కు చేరుకొని అందరూ అక్కడే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పశ్చిమ బెంగాల్ సచివాలయం చేరుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో వారు సమావేశమవుతారు. సమావేశం ముగిసిన తరువాత కాళీ ఘాట్ లోని కాలీమాత ఆలయాన్ని దర్శించుకొని రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.