మేము కూడ తప్పుకొంటున్నాం: భాజపా

కేంద్రమంత్రి వర్గంలో నుంచి తమ ఇద్దరు మంత్రులు తప్పుకోబోతున్నట్లు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ప్రకటించగానే, ఏపి భాజపా నేతలు, మంత్రులు కూడా నిన్న రాత్రి అత్యవసరంగా విజయవాడలోని ఐలాపురం హోటల్లో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. బాబు మంత్రివర్గంలో వైద్య శాఖ మంత్రిగా చేస్తున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ఇద్దరూ గురువరం ఉదయం తమ పదవులకు రాజీనామాలు చేస్తారని భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. కొద్ది సేపటిక్రితమే అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఇద్దరు భాజపా మంత్రులు హాజరవలేదు. మరికొద్ది సేపటిలో వారు శాసనసభలోనే ఈ విషయం ప్రకటించి చంద్రబాబుకు తమ రాజీనామా పత్రాలు అందించబోతున్నారు. దీంతో తెదేపా, భాజపాలు తమ మూడున్నరేళ్ళ బంధం తెంచుకొన్నాయి. ఇక నేటి నుంచి ఆ రెండు పార్టీలు యుద్దానికి సిద్దం కాబోతున్నాయి.