మజ్లీస్ కనుసన్నలలో తెరాస: కిషన్ రెడ్డి

 కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దం అవుతుండటం, ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపాలని కోరుతూ తెరాస ఎంపిలు పార్లమెంటు లోపలా బయటా ఆందోళన చేస్తుండటంతో రాష్ట్రంలో భాజపా కూడా తెరాస సర్కార్ పై కత్తులు దూయడం మొదలుపెట్టింది. 

భాజపా శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాస సర్కార్ మజ్లీస్ కనుసన్నలలో పనిచేస్తోంది. దానిని మంచి చేసుకొని ముస్లింల ఓట్లు సంపాదించుకోవడానికే అది ముస్లిం రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చింది. అందుకే తెరాస ఎంపిలు డిల్లీలో హడావుడి చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల అంశంపై కేంద్రం రాజ్యాంగం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుందనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ తెరాస ఎంపిలు వితండవాదం చేస్తూ పార్లమెంటులో ఆందోళనలు చేయడం సిగ్గుచేటు. వారు డిల్లీలో తెలంగాణా రాష్ట్ర పరువు తీస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచితే బిసిలకు అన్యాయం జరుగుతుందని తెరాస ఎంపిలకు తెలియదా? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న తెరాసకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు. నేను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో తెరాస దుష్ప్రచారం చేయిస్తోంది. తెరాస ఎంత దుష్ప్రచారం చేసినా నేను ఎన్నటికీ భాజపాను వీడేది లేదు,” అని కిషన్ రెడ్డి అన్నారు.