మావోల ప్రతీకారానికి టిఎస్ఆర్టిసి దగ్ధం

ఇటీవల తెలంగాణా-ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందడంతో తీవ్ర ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులు హైదరాబాద్ డిపోకు చెందిన టిఎస్ఆర్టిసి బస్సును, ఒక ప్రైవేట్ వాహనం, ఒక టిప్పరు, ఒక ట్రాక్టర్ లను దగ్ధం చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సుకుమా జిల్లాలో దొర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్తి అనే గ్రామం వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి జగదల్ పూర్ వెళుతున్న బస్సును మావోయిస్టులు ఆ ప్రాంతంలో అడ్డగించి, ప్రయాణికులను అందరినీ బస్సులో నుంచి దించేసి బస్సుకు నిప్పు పెట్టారు. ఆ తరువాత ఆ మార్గం గుండా వెళుతున్న ప్రైవేట్ వాహనాలను అడ్డుకొని వాటికీ నిప్పు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని పోలీసుగా అనుమానించి అతనిని అందరూ చూస్తుండగానే మావోయిస్టులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంగతి తెలుసుకొన్న ఛత్తీస్ ఘడ్ పోలీసులు అక్కడికి చేరుకోనేసరికి మావోయిస్టులు పరారయ్యారు.