తెలంగాణలో అందునా హైదరాబాద్ లో శాంతి భద్రతల మీద ముందు నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందుకే పోలీసింగ్ ను మరింత బలపరుస్తూ బడ్జెట్ ను భారీగా పెంచింది. పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులకు కూడా కేసీఆర్ సర్కార్ పూనుకుంది. న్యూయార్క్ తరహాలో పోలీసింగ్ కోసం తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పోలీస్ టవర్స్ తో దేశంలోనే అతిపెద్ద కంట్రోల్ రూంను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రెండు భవనాలతో ట్విన్ టవర్స్ గా దీన్ని నిర్మించనుంది.
శాంతి భద్రతల పరిరక్షణ బలోపేతం కోసం ప్రభుత్వం నిర్మించనున్న ట్విన్ టవర్స్ పై క్లారిటీ వచ్చింది. భవనాల ఎత్తును 135 మీటర్లవరకూ ఉండొచ్చని చెబుతూ… నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ జీవోను విడుదల చేసింది. జీవోనెంబర్ 190, 191ని విడుదల చేసిన ప్రభుత్వం.. మొత్తం ఏడు ఎకరాల్లో నిర్మాణానికి ఓకే చెప్పింది. ఇందులోనే హెలీపాడ్ కూడా ఉండాలని చెప్పింది. భవనాన్ని కట్టేందుకు.. ఫైర్ సర్వీసులతో పాటు.. అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం.