వచ్చే ఎన్నికలలో తెరాసకు కనీసం 100 సీట్లు గరిష్టంగా 106 సీట్లు గెలుచుకోవడం ఖాయం అని ముఖ్యమంత్రి కెసిఆర్ బల్లగుద్ది చెపుతున్నారు. ఇక తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీకి కనీసం 70 సీట్లు రావడం ఖాయమని, ఇప్పటి నుంచే కాస్త గట్టిగా కృషి చేస్తే 100 సీట్లు గెలుచుకోగలమని నిన్ననే నిజామాబాద్ లో ప్రకటించారు.
ఈ రెండుకాక ఇంకా భాజపా, తెదేపా, బిఎల్ఎఫ్, తెలంగాణా ప్రజాసమితి (ప్రొఫెసర్ కోదండరాం), తెలంగాణా ప్రజాపార్టీ( జస్టిస్ చంద్రకుమార్) తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ఉండనే ఉంటారు. వారు కూడా 100 కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు తప్పక గెలుచుకోగలమనే నమ్మకంతోనే బరిలో దిగుతున్నారని చెప్పకతప్పదు. తెలంగాణాలో 119 అసెంబ్లీ సీట్లే ఉన్నప్పటికీ, అన్ని పార్టీలు కనీసం 70కి తక్కువ కాకుండా గెలుచుకోగలమనే నమ్మకం కలిగి ఉండటం విశేషమే.
ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర సోమవారం నిజామాబాద్ జిల్లాలో నందిపేట, భీమ్ గల్ మండలాలకు చేరినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మేము బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రజలలోకి వెళ్ళగానే ఉలిక్కిపడిన కెసిఆర్, ప్రజల దృష్టిని ఆకర్షించడానికే ఈ ధర్డ్ ఫ్రంట్ అనే సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. బంగారి తెలంగాణా పేరుతో రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించినందుకు రాబోయే ఎన్నికలలో తెరాస ఘోరంగా ఓడిపోవడం ఖాయమని గ్రహించారు. తెరాసకు 100 సీట్లు కాదు 10 సీట్లు వచ్చినా గొప్పే. ఇక రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకొని కెసిఆర్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఉద్దరిస్తానంటే నమ్మశక్యంగా ఉందా? రాష్ట్రాన్ని ఉద్ధరించలేనివాడు ఇక దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాడు? రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా నిశబ్ద విప్లవం మొదలైంది. వచ్చే ఎన్నికలలో అది బయటపడుతుంది. తెరాస ఒక్క ఎంపి సీటు కూడా గెలుచుకోలేదు. ఇక డిల్లీకి ఎలా వెళతారు?” అని ఎద్దేవా చేశారు.
ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకు మజ్లీస్, జనసేన పార్టీలు వెంటనే మద్దతు ప్రకటించడంపై స్పందిస్తూ, “మజ్లీస్ సంగతి అందరికీ తెలిసిందే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం. మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు జై కొట్టింది. తెరాస అధికారంలో ఉంది కనుక కెసిఆర్ కు జై కొడుతోంది. ఇక రాష్ట్రంలో ఒక్క ఎంపి, ఎమ్మెల్యే సీటు కూడా లేని జనసేన కెసిఆర్ కు ఏవిధంగా మద్దతు ఇస్తుందో పవన్ కళ్యాణ్ కే తెలియాలి,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.