తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి మీద ప్రత్యేక దృష్టిసారించిన విషయం అందరికి తెలిసిందే. తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలను మరింత శోభాయమానంగా తయారు చేసే పనిలో కేసీఆర్ పడ్డారు. అందులో భాగంగా వేములవాడ రాజరాజేశ్వరీ స్వామి దేవాలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చారు. వేములవాడ దక్షిణకాశీగా ప్రసిద్ది గాంచింది.
సామాన్య భక్తులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను కూడా ఆకర్షించేలా వేములవాడను పిలిగ్రిమ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు వీటీడిఏ అధికారులు ప్లాన్ తయారు చేశారు. ఆలయాభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. రాజగోపురం, ఆలయ ప్రాకారాలు, పుష్కరిణి, కళ్యాణ మంటపం, అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ తో పాటు ఇతర నిర్మాణాల నమూనాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ నిర్మాణాలు, కట్టడాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. వేములవాడకు సమీపంలో ఉన్న నాంపల్లిని కూడా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోబోతున్నారు. నాంపల్లి నుంచి వేములవాడ క్షేత్రం వరకు రోప్ వే ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. టీటీడీ తరహాలో సామాన్య భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు.
వేములవాడకు వచ్చే భక్తులు కోడె మొక్కులు, పుష్కరిణి స్నానమాచరించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారని అధికారులకు వివరించారు. ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉండేందుకు దేవతా వృక్షాలను నాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.ఆలయాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ ను కలిసి, సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శృంగేరీ పీఠం వెళ్లి ఆలయ నమూనాలకు తుది మార్పులు, చేర్పులు చేపట్టాలని అధికారులకు సూచించారు.